తెలంగాణలో ఆర్టీసీ బస్సుల రంగు తర్వలోనే మారబోతోంది. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొత్త ఎండీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రయోగాత్మకంగా తొలుత హైదరాబాద్ సిటీ బస్సుల రంగు మార్చాలని ఆర్టీసీ భావిస్తోంది. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీ నెమ్మదిగా ఆదాయం పెంచుకుంటోంది. అయితే ప్రయాణికులను మరింత ఆకట్టుకోవడం ద్వారా లాభాల ట్రాక్ ఎక్కాలంటే ఇంకా మెరుగైన సేవలు అందించాలని సంస్థ భావిస్తోంది. ఈ క్రమంలోనే మొదటగా బస్సుల రంగు మారిస్తే మంచి ఫలితాలు పొందచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
చాలాకాలంగా ఒకే రంగుతో ‘పాతబడ్డ’ బస్సులకు కొత్త రంగులతో కొత్త లుక్‌ తేవాలని భావిస్తున్నారు. గతంలో నగరంలో ఆకుపచ్చ, పెసర రంగులతో సిటీబస్సులు ప్రత్యేకంగా కనిపించేవి. డబుల్‌ డెక్కర్‌ బస్సులకు కూడా ఇవే రంగులుండేవి. 15 ఏళ్ల క్రితం దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో బస్సుల రంగులు మార్చారు. పల్లెలు పచ్చదనంతో మెరిసిపోయే తరుణంలో, బస్సులు కూడా దాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్న ఉద్దేశంతో రంగులు మార్చారు. అందుకే పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ రంగుతో ఉంటున్నాయి. ఈ సమయంలోనే నగరంలో ఆకుపచ్చ, పెసర రంగు కాంబినేషన్‌లో ఉండే రంగులు కూడా మారి ఎరుపు రంగు వచ్చింది.
అయితే దశాబ్దంన్నరగా ఆ బస్సుల రంగు చూసి ప్రయాణికులకు బోర్ కొట్టేసిందన్న భావన ఆర్టీసీ అధికారుల్లో వ్యక్తమవుతోంది. దీంతో అందరినీ ఆకట్టుకునేలా సరికొత్త రంగులు వేయాలని భావిస్తున్నారు. తెలుపు రంగు వెంటనే ఆకర్షిస్తుందన్న ఉద్దేశంతో తెలుపుతో కలిపి ఇతర రంగు వేయించాలన్న ఆలోచన ఉండగా, గతంలో బాగా ఆకట్టుకున్న ఆకుపచ్చ–పెసరి రంగును కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ బస్సుకు ఆ రంగు వేయించారు. మరో ఏడెనిమిది కాంబినేషన్లతో రంగులు వేయించి మెరుగ్గా ఉన్న దాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే సిటీ బస్సులతో పాటు జిల్లా బస్సుల రంగులు కూడా మార్చే అవకాశముంది. nivaSri

Leave your comment

Your email address will not be published. Required fields are marked *